నకిరేకల్, వెలుగు : నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. శుక్రవారం నకిరేకల్ మండలం, గోరింకలపల్లి, మంగళపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాలకు వచ్చిన ధాన్యం, తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యంగా 17 శాతం తేమతో వచ్చిన ధాన్యాన్ని ఆపొద్దని నిర్వాహకులకు సూచించారు.
ఒకవేళ తేమ శాతం కోసం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని ఉంచాల్సి వస్తే వర్షం వచ్చినా తడవకుండా ముందు జాగ్రత్తగా టార్పాలిన్లు కప్పాలని చెప్పారు. వ్యవసాయశాఖ అధికారులు పరిశీలించి ధ్రువీకరించిన తర్వాతే ధాన్యాన్ని లిఫ్ట్ చేయాలని తెలిపారు. ఆమె వెంట ఆర్డీవో అశోక్ రెడ్డి, డీసీవో పత్యానాయక్ తదితరులు ఉన్నారు.