భూ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

 భూ సమస్యలను పరిష్కరించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

చండూరు ( నాంపల్లి), వెలుగు : ధరణి పోర్టల్ లో పెండింగ్ లో  ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం నాంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి ధరణి పోర్టల్ లో పెండింగ్​లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూములకు సంబంధించిన అన్ని కేసులను వేగవంతం చేయాలన్నారు. 

ఆర్ఐ, సర్వేయర్లు దరఖాస్తుదారుడితోపాటు క్షేత్రస్థాయికి వెళ్లి జియో కో-ఆర్డినేటర్స్​తో సహా వివరాలు సమర్పించి భూ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం భూమి సమస్యల పరిష్కారానికై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన టీపీ గౌరవరం రైతులతో కలెక్టర్ మాట్లాడి భూ సమస్యల దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారంపై ఆర్డీవోతో ఫోన్​లో మాట్లాడి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. 

ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

నల్గొండ అర్బన్, వెలుగు : విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. గురువారం కనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లను పంపిణీ చేశారు.

 ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని సూచించారు. కేజీబీవీ పాఠశాలతోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్​ వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్వో అమరేందర్, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, అశోక్ రెడ్డి, తహసీల్దార్ పద్మ, ఎంపీవో సుమలత, ఎంఈవో పద్మ తదితరులు ఉన్నారు.