నాణ్యమైన విత్తనాలు తయారు చేయాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు(గోవిందరావుపేట), వెలుగు :  నాణ్యమైన విత్తనాలను మాత్రమే తయారు చేయాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి  అన్నారు.  గురువారం గోవిందరావుపేటలోని టీఎస్​ఎస్​డీసీ ప్రాసెసింగ్​ యూనిట్​ ను కలెక్టర్​  సందర్శించారు.  విత్తనం తయారీ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్​ పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ   ఎవరైనా నకిలీ విత్తనాలు తయారు చేసినా, అమ్మినా   చర్యలు ఉంటాయని హెచ్చరించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ చంద్ర, టీఎస్​ఎస్​డీసీ ఫీల్డ్ సూపర్​ వైజర్​ భిక్షపతి, ఏఓ టెక్నికల్ ఎండీ వాజిద్, ఏఈఓ లు గోపాల్ రెడ్డి, దాదా సింగ్ తదితరులు  పాల్గొన్నారు.

గుర్తింపు ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి : కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ములుగు :  రైతులు వ్యవసాయ శాఖ ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. నకిలీ విత్తనాల నియంత్రణ కోసం జిల్లాలో రెండు టాస్క్​ ఫోర్స్​ బృందాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ ఒక ప్రకటనలో వెల్లడించారు. విడిగా ఉన్న సంచుల్లోని విత్తనాలను కొనుగోలు చేయరాదని, సంబంధిత కంపెనీ లేబుల్ ఉన్న ప్యాకెట్లను కొనాలని తెలిపారు. కొనుగోలు చేసిన విత్తనాల ఖాళీ ప్యాకెట్లను, బిల్లులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకుంటే నకిలీ విత్తనాల కారణంగా దిగుబడి రానప్పుడు సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు.  నకిలీ విత్తనాల నియంత్రణ కోసం ములుగు, ఏటూరునాగారం ఏడీఏలు, విత్తన ధ్రువీకరణ అధికారి, పోలీసు అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని, ఈబృందం 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని అన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్టు తెలిస్తే   ములుగు ఏడీఏ శ్రీపాల్​ 7288894761, ఏటూరు నాగారం ఏడీఏ శ్రీధర్ 7288894766 నెంబర్లలో సంప్రదించి సమాచారం అందించాలన్నారు.