గొత్తికోయ చిన్నారులకు ఆరోగ్య సేవలు అందించాలి : ఇలా త్రిపాఠి

గొత్తికోయ చిన్నారులకు ఆరోగ్య సేవలు అందించాలి : ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు: జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయ చిన్నారులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. రైతులకు సోలార్​ ప్యానళ్ల ద్వారా వ్యవసాయం చేసేందుకు ప్రోత్సహించాలన్నారు. బుధవారం ములుగు కలెక్టరేట్ లో టాటా ట్రస్ట్​ స్వచ్ఛంద సంస్థ సభ్యులతో ఆర్డీవో సత్యపాల్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. గొత్తికోయ ప్రాంతాల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులకు పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఆరోగ్య పరీక్షలు, సేవలు అందించాలని టాటా ట్రస్ట్ సభ్యులతో చర్చించారు. 

అనంతరం కలెక్టర్​ మాట్లాడుతూ వచ్చే వర్షాకాలంలో అటవీ ప్రాంతాల్లో నివసించే గొత్తికోయలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రైతులు పంట పొలాలవద్ద సోలార్ ప్యానల్స్ వినియోగించడం ద్వారా ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిని స్వర్ణలత, జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చంద్ర, మైనారిటీ సంక్షేమ అధికారి ప్రేమలత, టాటా ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ రీజనల్ మేనేజర్ భగీరథ గోప్ తదితరులు పాల్గొన్నారు.