జగిత్యాల రూరల్, వెలుగు : కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 30 నుంచి జూన్ 1 వరకు హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ టిఎస్ దివాకర తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంగా ఈనెల 29 లోగా ఉత్సవాల ఏర్పాటును పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ నెల 30న భద్రాచలం నుంచి వచ్చే పట్టువస్త్రాలను స్వామి వారికి అలంకరిస్తామన్నారు. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలకు సుమారు లక్షన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఏ రకమైన సమస్యలు తలెత్తకుండా ఆలయ అధికారులు, ఉద్యోగులు, తాత్కాలిక ఒప్పంద ఉద్యోగులు సమన్వయం చేసుకుంటూ షిఫ్టుల వారీగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, జెడ్పీ సిఇఓ రఘువరన్, డిఎస్పీ రఘు చందర్, ఆలయ ఈఓ చంద్ర శేఖర్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.