కొల్లాపూర్, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వడ్లను కొనుగోలు చేసి, డబ్బులు సకాలంలో అందేలా చూడాలని కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సీతారామారావుతో కలిసి పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన వడ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వడ్ల కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో మిగిలిన వడ్లను కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో 148 కొనుగోలు కేంద్రాల ద్వారా 36,560 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని, 3,968 రైతులకు రూ.50.11 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో ఆందోళన చెందవద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. ఆర్డీవో నాగరాజ్, తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.