నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : జిల్లాలో రక్తం అందక గర్భిణులు, బాలింతలు చనిపోతుంటే డాక్టర్లు ఏం చేస్తున్నారని కలెక్టర్ ఉదయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లతో సమీక్షించారు. జిల్లాలో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు డెలివరీ కాగానే ఆరుగురు తల్లులు చనిపోయినట్లు తెలుసుకున్న ఆయన.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో 22 ఏళ్ల వాళ్లు కూడా ఉండడం బాధాకరమన్నారు. ఇక నుంచి రక్తం అందక ఒక్కరు కూడా చనిపోవద్దని, రక్తహీనత, బీపీ ఎక్కువ ఉన్న గర్భిణులను గుర్తించి.. 15 రోజుల ముందుగానే ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు.
జిల్లా ఆస్పత్రిలో రక్తం స్రావం అయిన గర్భిణిని మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తోటపల్లి తిమ్మాజిపేట, వెల్దండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఘటనలకు సంబంధించిన డాక్టర్లు హాజరు కాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్.. షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రఘుపతి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జరిగిన బాలింత మరణంపై సమగ్రంగా విచారించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ భరత్ రెడ్డి, కల్వకుర్తి డాక్టర్ డాక్టర్ శివరాం, జిల్లా ఆసుపత్రి గైనకాలజిస్ట్ నిర్మల దేవి, ఆర్‌ఎంవో డాక్టర్ అజీమ్, డాక్టర్ రోహిత్, కొల్లాపూర్ డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.