అచ్చంపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఉంటుందని కలెక్టర్ ఉదయ్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆశ్రమ పాఠశాలల జోన్ స్థాయి క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచ్చంపేట మూడోసారి జోనల్ స్థాయి క్రీడలకు ఆతిథ్యమివ్వడం గర్వకారణమన్నారు.
నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల విద్యార్థిను పాల్గొంటున్నారని, ఈ పోటీల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. మూడు రోజుల పాటు అండర్–14, 17 విభాగంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, లాంగ్ జంప్, హైజంప్, హ్యాండ్ బాల్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించనున్నారు. మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, ఆర్డీవో గోపీరాం, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట డీటీడబ్ల్యూవోలు కమలాకర్‌రెడ్డి, రాజ్ కుమార్, శంకర్, ఏటీడబ్ల్యూవోలు లక్ష్మారెడ్డి, బాలకృష్ణ, ఎంఈవో రామారావు, సీఐ అనుదీప్ పాల్గొన్నారు.