సంగారెడ్డి టౌన్ ,వెలుగు : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డులో మంజూరు పథకాలు అర్హులైన పేదలకు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో వీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, నూతన రేషన్ కార్డుల మంజూరు , ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు తదితర పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఏ విధమైన ఫిర్యాదులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
గతంలో ఉన్న మార్గదర్శకాల మేరకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు వన్ రేషన్ వన్ స్టేట్ గా రేషన్ కార్డులు జారీ ప్రక్రియలు చేపట్టాలని సూచించారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, పీడీ డీఆర్డీఏ జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, పీడీ హౌసింగ్ చలపతిరావు రెవిన్యూ డివిజనల్ అధికారులు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.