గద్వాల, వెలుగు : అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ రూల్స్ పాటించాల్సిందేనని కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. మంగళవారం ఐవోడీసీ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు రూల్ ప్రకారం సువిధ పోర్టల్ లో ఆన్ లైన్ లో తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలన్నారు. నామినేషన్ తరువాత అభ్యర్థి తన ఎన్నికల ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు.
ముందస్తు అనుమతి లేకుండా అభ్యర్థి తరపున ప్రచారం చేస్తే సెక్షన్ 171 హెచ్ కేసులు బుక్ చేస్తామని తెలిపారు. మద్యం, డబ్బు పంచితే ఆ అభ్యర్థి డిస్ క్వాలిఫై కావడమే కాకుండా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోతాడన్నారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ చౌహాన్, చీర్ల శ్రీనివాసరావు, ఆర్డీవో చంద్ర కళ పాల్గొన్నారు.
ప్రపోజల్స్ పంపించాలి..
మహబూబ్ నగర్ కలెక్టరేట్ : ఈ నెల 18 లోగా డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ సెంటర్ల ప్రపోజల్స్ పంపించాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. రిటర్నింగ్, నోడల్ ఆఫీసర్లతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ట్రైనింగ్ ప్రారంభించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీవో అనిల్ కుమార్, అడిషనల్ కలెక్టర్ ఎస్. మోహన్ రావు, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ పాల్గొన్నారు.
ఎన్నికల ఫిర్యాదులపై స్పందించాలి..
నాగర్ కర్నూల్ టౌన్ : జిల్లాలో ఎలక్షన్ రూల్స్ పక్కాగా అమలు చేసి, ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా, మీడియాలో ఫేక్ న్యూస్ ప్రసారమైనా, ఓటర్లకు ఎలాంటి అనుమానాలు వచ్చినా నివృత్తి చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. నోడల్ ఆఫీసర్లుఉష, నర్సింగ్ రావు, మాస్టర్ ట్రైనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
ప్రతి వెహికల్ చెక్ చేయాలి..
నారాయణపేట/ఊట్కూర్ : రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ లలో ప్రతి వెహికల్‌ను పక్కాగా తనిఖీ చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఎస్పీ యోగేశ్ గౌతంతో కలిసి జలాల్ పూర్ చెక్ పోస్ట్ ను పరిశీలించారు. సెంట్రీ రిజిస్టర్ లో ప్రతి విషయాన్ని నమోదు చేయాలని ఆదేశించారు. బార్డర్ చెక్‌పోస్టుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. స్టేట్ బార్డర్లలో ఏడు చెక్‌పోస్టులు, జిల్లా బార్డర్లో రెండు చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.
పట్టుబడిన డబ్బులు గ్రీవెన్స్ కమిటీ ముందు ఉంచి సరైన ఆధారాలు చూపిన తరువాతే తిరిగి ఇవ్వాలని, ఆధారాలు చూపకుంటే సీజ్చేయాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని శ్రీదత్త బీఈడీ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్లు మయాంక్ మిత్తల్, అశోక్ కుమార్, డీఎస్పీ సత్యనారాయణ పాల్గొన్నారు.