గద్వాల, వెలుగు: ట్రాన్స్ జెండర్స్, సెక్స్ వర్కర్లకు ఆర్థికసాయం అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో ట్రాన్స్ జెండర్స్, సెక్స్ వర్కర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 12 మంది ట్రాన్స్ జెండర్స్, 490 మంది సెక్స్ వర్కర్స్ ఉన్నారని చెప్పారు. వారందరికీ ఓటు హక్కు కల్పించాలని, ఓటు హక్కు లేని వారికి ఫామ్–6 ద్వారా దరఖాస్తు చేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు. స్వయం సహాయక బృందాలుగా ఏర్పాటు చేసి లోన్లు ఇచ్చేలా చూడాలన్నారు. శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్ బేగం పాల్గొన్నారు.
నియోజకవర్గాలకు ఈవీఎంలు..
మొదటి ర్యాండమైజేషన్ తర్వాత ఈవీఎంలు, వీవీ ప్యాట్లను అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్లకు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. గద్వాల నియోజకవర్గానికి 378 చొప్పున బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, 424 వీవీ ప్యాట్లను, అలంపూర్ నియోజకవర్గానికి 362 చొప్పున బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, 406 వీవీ ప్యాట్స్ ను పంపిణీ చేసి స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, శ్రీనివాసులు ఉన్నారు.