
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంఈవోలు, ఎంపీడీవోలు, మండల, పట్టణ సమాఖ్యలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్కూల్స్ మెయింటెనెన్స్‌ను స్వశక్తి మహిళా సంఘాలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.
విద్యా ప్రమాణాలు పెంచి నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు అందించాలని, డ్రింకింగ్ వాటర్, మరుగుదొడ్ల రిపేర్లు, బాలికల పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టాలన్నారు. అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, డీఆర్డీవో జ్యోతి, మెప్మా పీడీ గీత పాల్గొన్నారు.