పుల్కల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. బుధవారం చౌటకూర్ మండలం బద్రిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముసాయిదా జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన, అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. అర్హత కలిగిన వారందరూ మళ్లీ గ్రామ సభలో లేదా ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అర్హుల నిర్ధారణ కోసం సామాజిక-ఆర్థిక సర్వే, మీ సేవా దరఖాస్తులు, గ్రామ సభలు, వార్డు సభల ద్వారా అందిన దరఖాస్తులను స్వీకరించి, సమగ్రంగా పరిశీలన జరుపుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.