
సంగారెడ్డి, వెలుగు : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి పిలుపు నిచ్చారు. శనివారం ఆమె పలు పోలింగ్ బూత్ లను సందర్శించారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, పోతిరెడ్డిపల్లి గవర్నమెంట్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాల నిర్వహణ తీరుతెన్నులు పరిశీలించారు. ఆయా బీఎల్ఓల దగ్గర ఉన్న ఓటరు జాబితాను పరిశీలించారు.
ఈ సందర్భంగా విధులకు ఆలస్యంగా వచ్చిన బీఎల్ఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ప్రత్యేక క్యాంపులను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ, తహసీల్దార్లు, తారా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు.
గీతం యూనివర్సిటీని సందర్శించిన కలెక్టర్
పటాన్చెరు: రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం7 సెగ్మెంట్లకు అవసరమైన స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాళ్లను పటాన్చెరు మండలం రుద్రారం వద్ద గల గీతం యూనివర్సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీతో కలిసి పరిశీలించారు.
ఎన్నికలకు తీసుకోవాల్సిన ఏర్పాట్ల ఆరాతీశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డీఆర్ఓ నగేశ్, డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ , ఆందోల్ రెవెన్యూ డివిజనల్ అధికారులు, పటాన్చెరు తహసీల్దార్, ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు