- పారిశుధ్య నిర్వహణ సజావుగా జరగాలె
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
సంగారెడ్డి, వెలుగు : జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఫిబ్రవరి నెలాఖరులోగా వంద శాతం పన్ను వసూళ్లు చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్ను, నల్లా బిల్లుల వసూళ్లు, పార్కులు, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, తదితర అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక డ్రైవ్ చేపట్టి పన్ను వసూలు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
మొండి బకాయిలు ఉన్నచోట ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పనితీరు బాగాలేని బిల్ కలెక్టర్ల పై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మున్సిపాలిటీల్లో ఫుట్ పాత్స్, జంక్షన్లలో ఎక్కడా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ అనుమతించవద్దన్నారు. పారిశుధ్య నిర్వహణపై దృష్టి సారించాలని, పట్టణ ప్రజలకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు.ప్రతిరోజు ఉదయం మున్సిపాలిటీల్లోని వార్డులు సందర్శించి ప్రజలతో ఇంటరాక్ట్ కావాలన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి కబ్జాలు, అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజూ ఇంటింటి చెత్త సేకరణ వంద శాతం జరగాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ మునిసిపాలిటీల కమిషనర్లు, పబ్లిక్ హెల్త్ ఈఈ, డీఈలు, ఆర్ఐలు పాల్గొన్నారు