
భైంసా, వెలుగు: మిల్లింగ్, బియ్యం నిల్వలు అందించే విషయంలో రైస్‌మిల్లర్లు తమ తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్వరుణ్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం భైంసాలోని రైస్ మిల్లుల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కత్గాం రోడ్డు మార్గంలోని రైస్‌మిల్లులో వడ్ల నిల్వలు, మిల్లింగ్ప్రక్రియను సక్రమంగా చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లందరూ త్వరగా మిల్లింగ్ ప్రక్రియను చేపట్టి బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించాలని ఆదేశించారు.
ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. అంతకు ముందు భైంసా పట్టణంలోని ఓవైసీనగర్కాలనీలో పర్యటించి జీవో నం.59కు సంబంధించిన ఇళ్లను పరిశీలించారు. లబ్ధిదారులు సకాలంలో ప్రభుత్వానికి రుసుము చెల్లించాలని సూచించారు. ఆ తర్వాత అగ్రికల్చర్ ఆఫీస్ సమీపంలోని ఎస్సీ కార్పొరేషన్షాపింగ్ కాంప్లెక్స్నిర్మాణ పనులను పరిశీలించి కమిషనర్ వెంకటేశ్వర్రావు, డిప్యూటీ ఈఈ నాగేశ్వర్ రావులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రవి కుమార్, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులున్నారు.