నిర్మల్/ఆదిలాబాద్ టౌన్, వెలుగు: నులిపురుగుల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక సోఫీ నగర్ లోని రెసిడెన్షియల్ విద్యాసంస్థలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నులిపురుగుల కారణంగా పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుందని.. దీని ద్వారా రక్తహీనత, ఆకలి లేకపోవడం, అలసట, కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడతాయన్నారు. ఏడాది నుంచి 19 ఏండ్ల వయసున్న ప్రతి ఒక్కరూ ఈ మాత్రలను వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ రాజేందర్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ నయనారెడ్డి, ఎన్సీడీ నిర్వహణ అధికారి డాక్టర్ శ్రీనివాస్, డీపీఆర్ఓ తిరుమల, ప్రిన్సిపాల్ గంగా శంకర్ తదితరులు పాల్గొన్నా రు.
పిల్లలందరికీ ఆల్బెండ జోల్ మాత్రలు వేయించాలి
పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం స్థానిక కొలాం ఆశ్రమ స్కూల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆగస్టు 3 నుంచి 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పిల్లల్లో పోషకాహారలోపం, రక్తహీనత, శారీరక, మానసిక సమస్యలను అరికట్టేందుకు మాత్రలను పంపిణీ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లు, కాలేజీల్లో మాత్రలు పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా.నరేందర్ రాథోడ్, ఐసీడీఎస్పీడీ మిల్కా, అడిషనల్డీఎంహెచ్ఓ డా.సాధన, ఏటీడీఓ నిహారిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.