గ్రామాల అభివృద్ధికి ప్లాన్స్‌ రెడీ చేయండి : కలెక్టర్ వెంకట్‌రావు

సూర్యాపేట, వెలుగు: గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని  కలెక్టర్ వెంకట్‌రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పంచాయతీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..   గ్రామ సభలు నిర్వహించి  పాలకవర్గం, ప్రజలతో చర్చించి శానిటేషన్,  రోడ్లు, మరుగుదొడ్లు, అంగన్వాడీ కేంద్రాల రిపేర్లపై ప్రణాళిక రూపొందించాలని సూచించారు. 

ఈ వివరాలను ఈనెల 31వ తేదీలోగా ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. భేటీ బచావో, భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా ఈనెల 20 నుంచి స్త్రీ,  శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో  అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 24న జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా నిర్వహించే సెల్ఫీ విత్ డాటర్ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. అలాగే బాలికలకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలన్నారు. 

జాతీయ ఓటర్ దినోత్సవానికి ఏర్పాట్లు చేయండి

 ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న జాతీయ ఓటర్‌‌ దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌‌ వెంకట్‌రావు అధికారులను ఆదేశించారు  అడిషనల్‌ కలెక్టర్ సిహెచ్ ప్రియాంకతో కలిసి నిర్వహించిన  సమీక్షలో ఆయన మాట్లాడుతూ..  స్కూళ్లు, కాలేజీల్లో వ్యాసరచన , ముగ్గులు, కబడ్డీ పోటీలు నిర్వహించాలని సూచించారు.  అలాగే 26న నిర్వహించునున్న గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలని  ఆదేశించారు.  పరేడ్ గ్రౌండ్‌లో వివిధ శాఖల ద్వారా  స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు  ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.