అర్హులైన దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్స్ : కలెక్టర్ వెంకట్‌‌రావు

సూర్యాపేట , వెలుగు :  అర్హులైన దివ్యాంగులందరికీ సదరం సర్టిఫికెట్స్ ఇస్తామని  కలెక్టర్ వెంకట్‌‌రావు చెప్పారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2016 లో పార్లమెంట్‌‌  దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం రూపొందించిందని, దీనిపై త్వరలోనే అన్ని శాఖల అధికారులకు అవగాహన కల్పిస్తామన్నారు.

సూర్యాపేటలోని డఫ్ అండ్ డబ్ స్కూల్‌‌ సమస్యలను దివ్యాంగుల సంఘాలు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా.. మూడు రోజులలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్వరలో బ్యాటరీ కలిగిన ట్రై సైకిల్స్ అందజేస్తామని, ఈ మేరకు నివేదికను ఇవ్వాలని డీడబ్ల్యూవో జ్యోతి పద్మను ఆదేశించారు.  అనంతరం వివిధ క్రీడల  పోటీల్లో గెలుపొందిన దివ్యాంగులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌‌వో కోటాచలం , డీఎస్పీ నాగభూషణం, ఎస్సీ అభివృద్ధి అధికారి దయానందరాణి, డీసీఎస్‌‌హెచ్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డీఈవో అశోక్  పాల్గొన్నారు. 

758 పరిశ్రమలకు అనుమతి 

 జిల్లాలో టీఎస్‌‌ఐపాస్‌‌ కింద పరిశ్రమల ఏర్పాటు కోసం 952 దరఖాస్తులు రాగా..  758 అప్రూవ్ చేశామని కలెక్టర్‌‌‌‌ వెంకట్‌‌రావు చెప్పారు.  127 దరఖాస్తులను తిరస్కరించామని, మిగితావి  పరిశీలనలో ఉన్నాయని వివరించారు. శుక్రవారం పరిశ్రమల శాఖ  సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా రైస్ మిల్లులు, ప్లాస్టిక్, సిమెంట్ ఫ్యాక్టరీస్, సిమెంట్ బ్రిక్స్ లకు దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు.  

టీప్రైడ్ పథకం కింద ఎస్సీలకు 18 యూనిట్లు, ఎస్టీలకు 131 యూనిట్లు,  దివ్యాంగులకు ఒక యూనిట్‌‌కు సంబంధించి  సబ్సిడీ మంజూరు చేశామన్నారు.  అడిషనల్‌‌ కలెక్టర్ ప్రియాంక, పరిశ్రమల శాఖ జీఎం తిరుపతయ్య, ఇన్‌‌స్పెక్టర్‌‌‌‌ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీదేవి, పొల్యూషన్ బోర్డ్ ఏఈ శంకర్ బాబు  పాల్గొన్నారు.