సూర్యాపేట, వెలుగు: జిల్లాకు సంబంధించి సీఎం గ్రీవెన్సు నుంచి వచ్చే దరఖాస్తులకు కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెంకట్‌రావు చెప్పారు. ఇది అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) ఆధ్వర్యంలో పనిచేయనున్నట్లు వివరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రజావాణి దరఖాస్తులపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టరేట్‌తో పాటు మండలాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణిలోఅధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు.
అధికారులతో పాటు అర్జీదారులు వెబెక్స్ స్క్రీన్ లో కనపడాలన్నారు. త్వరలో జీపీ స్థాయిలో ప్రజావాణి నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జడ్పీ సీఈవో, డీపీవోలకు సూచించారు. శనివారం సాయంత్రం వరకు మండలాలకు వచ్చిన దరఖాస్తులను గూగుల్ షీట్‌లో పంపాలని ఆదేశించారు. అర్జీలకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలన్నారు. జడ్పీ సీఈవో సురేశ్, పీడీ కిరణ్ కుమార్, సీపీవో వెంకటేశ్వర్లు, పరిశ్రమల శాఖ జీఎం తిరుపతయ్య, డీసీవో మోహన్ బాబు పాల్గొన్నారు.