గ్యాస్‌ కేవైసీకి ఎలాంటి గడువు లేదు : వెంకట్‌రెడ్డి

సూర్యాపేట , వెలుగు : గ్యాస్‌ కేవైసీ చేసుకునేందుకు చివరి తేదీ లేదని, ప్రజలు అపోహలను నమ్మొద్దని అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో డీఎస్‌వో మోహన్‌బాబు, సివిల్ సప్లై ఆఫీసర్లతో కలిసి ఎల్పీజీ డీలర్లతో మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేవైసీ పేరుతో అపోహలు సృష్టించి, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేవైసీ  నమోదు ప్రతి రెండేళ్లకు ఒక సారి జరిగే సాధారణ పక్రియ అని, ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పాలని ఏజెన్సీలను ఆదేశించారు. కేవైసీ నమోదు సమయంలో సురక్ష పైపులను బలవంతంగా అంటగట్టవద్దని, అవసరం ఉన్న వారు మాత్రమే కొనాలన్నారు. రూ. 500కు సిలిండర్‌ సరఫరాపై ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదని క్లారిటీ ఇచ్చారు.