- కలెక్టర్ వెంకటరావు
సూర్యాపేట, వెలుగు : జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రతి మండలం, మున్సిపాలిటీలో జిల్లా అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వెంకటరావు తెలిపారు. ఈ కమిటీలు గ్రామాలు, వార్డుల్లో పర్యటించి నీటి సమస్యను గుర్తించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తాయని చెప్పారు. శనివారం ఇమాంపేటలోని తాగు నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించి.. నీటి సరఫరాపై ఏఈ జనార్దన్ అడిగి తెలుసుకున్నారు. గ్రిడ్ డీఈ రాజేందర్ అందుబాటులో లేకపోవటంపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
కమిటీ సభ్యులతో ఆర్డీవోలు వారంలో రెండు సార్లు సమీక్ష నిర్వహిస్తారని, ప్రతి గురువారం జిల్లా స్థాయిలో మీటింగ్ ఉంటుందని చెప్పారు. పాలేరు నుంచి చందుపట్ల, చిల్పకుంట్ల ద్వారా మున్సిపాలిటీలు, మండలాలకు తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, ఏఈ జనార్దన్ రెడ్డి ఉన్నారు.
టెన్త్ ఎగ్జామ్ సెంటర్ల తనిఖీ
పెన్ పహాడ్, వెలుగు : పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని టెన్త్ ఎగ్జామ్ సెంటర్లను శనివారం కలెక్టర్ వెంకటరావు తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా సెంటర్లలో అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తాగునీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట చీఫ్ సూపరింటెండెంట్ వెంకటయ్య , తహసీల్దార్ మహేందర్ రెడ్డి, ఎంపీడీవో వెంకటేశ్వరరావు ఉన్నారు.