మఠంపల్లి, వెలుగు: మఠంపల్లి మండలం పెదవీడు దగ్గర సాగర్ సిమెంట్స్ మైన్స్ విస్తరణ కోసం శనివారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. కలెక్టర్ వెంకట్రావు అధ్యక్షతన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. 3.3 మిలియన్ టన్నుల నుంచి 5.04 మిలియన్ టన్నుల మైనింగ్ విస్తరణ, ఉత్పత్తి పెంపు పై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. 56 మంది తమ అభిప్రాయాలను వెల్లడించగా 53 మంది మద్దతు తెలిపినట్టు కలెక్టర్ పేర్కొన్నారు.
పరిశ్రమ ప్రభావిత ప్రాంతాలలో విద్య, వైద్యం మెరుగుపరచాలని,కొన్నేళ్లుగా పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. తమ భూములు వివాదంలో ఉన్నాయని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీ ప్రతినిధులు, రైతులతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి సానుకూలంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మినరల్ ఫండ్స్ ను ప్రభావిత ప్రాంతాలలోనే ఖర్చు చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
ప్రజాభిప్రాయ సేకరణపై కోర్టును ఆశ్రయించిన రైతులు కూడా తమ అభిప్రాయాలను తెలపాలని కోరగా ఎవరూ ముందుకు రాలేదు.అనంతరం పరిశ్రమ ప్రతినిధి ఎం వి రమణ మూర్తి మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన డిమాండ్స్ ను కంపెనీ పరిధి లో ఉన్న మేరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో పీసీబీ ఈఈ సురేశ్, డీ ఎఫ్ ఓ సతీష్ హుజూర్నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సీఐ చరమందరాజు , తహసీల్దార్ మంగ,పరిశ్రమ ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.