సూర్యాపేట, వెలుగు : జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో వెబెక్స్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో కలెక్టర్మాట్లాడారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి సమస్యను గుర్తించి వెంటనే నివేదిక అందించాలని సూచించారు. తాగునీరు సరఫరా చేసే పైపులు ఎవరైనా పగలగొడితే వెంటనే పరిశీలించి వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.
అత్యవసరమైతే గ్రామాల్లో ట్యాంకర్స్ ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ను ఆదేశించారు. పాలేరులో ఇంటెక్ వెల్ కి నీరు అందకపోవడంతో అప్రోచ్ కెనాల్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అప్రోచ్ కెనాల్ కాల్వలో పూడిక మట్టిని తీసివేసే పనులు పూర్తి చేసి శనివారం నాటికి తాగునీరు సరఫరా చేస్తామన్నారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కాన్ఫరెన్స్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మిషన్ భగీరథ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ ఎస్ వెంకట్రావ్ అధికారులకు సూచించారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. మూడో అంతస్తులో పరీక్షా కేంద్రాలనుపెట్టడంలో అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మూడంతస్తుల ఎక్కడంతో అలసటకు గురవుతారని, ఇలాంటి పొరపాట్లు మళ్లీ చేయొద్దని ఇన్చార్జి డీఈవో శైలజను హెచ్చరించారు. ప్రతిఒక్కరినీ తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపాలన్నారు.