
ఆసిఫాబాద్/బజార్ హత్నూర్/లోకేశ్వరం, వెలుగు : భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నా మని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం కెరమెరి మండలం కేస్లగూడ గ్రామంలోని రైతు వేదికలో భూభారతి ఎమ్మెల్సీ దండే విఠల్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి నూతన ఆర్ఓఆర్ చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూభారతి చట్టంలో పొందుపరిచిన అంశాలు రైతుల సమస్యల పరిష్కారానికి తోడ్పడతాయన్నారు.
భూభారతి చట్టంలో అప్పీలు వ్యవస్థ కీలకంగా మారనున్నట్లు చెప్పారు. అన్యాయం జరిగితే ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్ ఏ స్థాయిల్లో అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. భూ హద్దుల గొడవలు, రీ సర్వే, కొనుగోలు, పాలు పంపకాలు, దాన దస్తావేజులు, విరాసత్, పట్టా మార్పిడికి కావాల్సిన పత్రాలు జతపరచడం వల్ల భవిష్యత్తులో భూ గొడవలు ఉండవని
పేర్కొన్నారు.
రైతులకు ఇబ్బంది లేకుండా కలిసి పనిచేయాలి
బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే అనిల్ జాద వ్తో కలిసి కలెక్టర్ రాజర్షి షా భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించారు. భూభారతి చట్టం ద్వారా సీసీఎల్ఏ స్థాయిల్లోనూ అప్పిలు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆర్ఓ ఆర్ అప్డేషన్, మ్యుటేషన్ వంటి సేవలు భూ భారతిలో సులభంగా అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అంతకుముందు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఎంపీ నగేశ్ మాట్లాడుతూ.. నాటి ధరణి చట్టంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, అలాంటి తప్పిదాలకు తావు లేకుండా భూ భారతి చట్టం ద్వారా రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, డీపీఆర్ వో తిరుమల, సహకార సంఘ చైర్మన్ వెంకన్న, తాహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో మహేందర్ రెడ్డి, వ్యవసాయ అధికారి మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.
భూముల సమస్యలు పరిష్కారమయ్యే సమయం వచ్చింది
భూభారతి చట్టం అమలులోకి రావడం వల్ల భూ సమస్యలు పరిష్కారమవుతాయిన నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతు వేదికలో అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. సాదా బైనామా, ఆర్ఎస్ఆర్, మిస్సింగ్ సర్వే నంబర్, భూవిస్తీర్ణం హెచ్చు తగ్గులు తదితర సమస్యల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఏడాది కాలంగా సుదీర్ఘంగా శ్రమించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.
దీని ద్వారా పరిపాలన వికేంద్రీకరణతో పాటు త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. గ్రామ సభల్లో పరిష్కారం కాని సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, భైంసా ఆర్డీవో కోమల్ రెడ్డి, తహసీల్దార్ మోతిరామ్, ఎంపీడీవో వెంకట రమేశ్, భైంసా, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఆనందరావు పటేల్, భీంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.