ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

 ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్/కాగజ్​నగర్, వెలుగు:  జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు సమన్వయంతో పనిచేసి పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. మంగళవారం  కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన రహదారి భద్రత కమిటీ సమావేశానికి ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి రహదారులపై ప్రమాదాల నివారణ కొరకు తీసుకోవలసిన చర్యలపై పలు శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు.

జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాహనదారులకు తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులు, కల్వర్టులు, వంతెనలపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపకుండా విస్తృతస్థాయి తనిఖీలు చేపట్టాలన్నారు.

బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖల ద్వారా జిల్లాలోని 105 స్వయం సహాయక సంఘాలకు మంజూరైన రూ.6.89 కోట్ల విలువైన చెక్కును అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీవో దత్తారాంతో కలిసి  మహిళలకు  కలెక్టర్ అందజే శారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్లు, ఇతర గుర్తించిన వ్యాపారాల్లో అభివృద్ధి చెందేందుకు రుణ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల పరిధిలో బాల్యవివాహాలు జరగకుండా పర్యవేక్షిస్తామని మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పకడ్బందీగా చేయాలి

ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ఇంటింట సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ధోత్రే సూచించారు. ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ గ్రామపంచాయతీలో,  కాగజ్​నగర్ పట్టణం ఆదర్శనగర్​లో  కొనసాగుతున్న సర్వే ప్రక్రియను పరిశీలించారు. ప్రతి ఒక్కరి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని, నిర్ణీత గడువులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు. కాగజ్​నగర్​లో కలెక్టర్​ వెంట సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, తహసీల్దార్ కిరణ్ కుమార్  ఉన్నారు.