
ఆసిఫాబాద్, వెలుగు: బాలికలు ఉన్నతస్థాయికి ఎదగాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బాలికల గురుకుల పాఠశాల, కాలేజీల్లో నిర్వహించిన బేటీ బచావో- బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. బాలికలను బతికించుకుందామని, ఉన్నత స్థాయికి ఎదిగేందుకు వారిని ప్రోత్సహిద్దామని పిలుపునిచ్చారు.
బాలికలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. జిల్లాలో 40 ప్రభుత్వ, ఆశ్రమ స్కూళ్లు, గురుకులాల్లో ప్రత్యేక బృందంతో ప్రేరణ తరగతులు నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త శారద, మాస్టర్ ట్రైనర్లు రాజేశ్, రమేశ్, ప్రిన్సిపాళ్లు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు
ఉపాధి హామీ పనుల్లో కూలీల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు. ఆసిఫాబాద్ మండలం ఎల్లారం శివారులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. పని ప్రాంతాల్లో తాగునీరు, ఓ ఆర్ఎస్ ప్యాకెట్లు, ఎండ తీవ్రత దృష్ట్యా నీడ సౌకర్యాలు కల్పించా లని ఆదేశించారు. జాబ్ కార్డులున్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు.
అనంతరం ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని పరిశీలించారు. నర్సరీ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శి కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నాటేందుకు అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో బానోత్ దత్తారాం, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులున్నారు.