రోడ్డు భద్రతా మాసోత్సవాలను సక్సెస్ చేయాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో చేపట్టిన రోడ్డు భద్రతా మాసోత్సవాలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. గురువారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా రహదారుల భద్రతా కమిటీ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పోలీస్, రెవెన్యూ, రవాణా, రోడ్లు భవనాలు, గ్రామీణాభివృద్ధి, ఇంజనీరింగ్, విద్యాశాఖ అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

జిల్లాలో చేపట్టిన రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఈనెల 31 వరకు నిర్వహిస్తామన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని.. గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి రోడ్డు భద్రత రూల్స్ పై విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. జిల్లాలో గతేడాది 239 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 45 బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

భూ సేకరణ ప్రక్రియ స్పీడప్ చేయాలి

జిల్లాలో అభివృద్ధి పనుల కోసం చేపట్టే భూ సేకరణ ప్రక్రియను స్పీడప్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి పలు శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాజెక్టులు, చెరువులు, కాలువలు, వంతెనలు, రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు, సింగరేణి, రైల్వే లైన్ విస్తరణలో అవసరమైన భూముల సేకరణ ప్రక్రియపై మాట్లాడారు. భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం త్వరగా చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. భూ సేకరణపై కోర్టుల్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా కోర్టులకు నివేదికలు సమర్పించాలని సూచించారు.