ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి .. ప్రజావాణిలో అర్జీదారులు

ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించండి .. ప్రజావాణిలో అర్జీదారులు

ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి లో అడిషనల్ కలెక్టర్​ ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

 ఉపాధి కల్పించాలని గంగామణి అనే మహిళ, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని ఆసిఫాబాద్ పట్టణం హడ్కో కాలనీకి చెందిన మార్క భాగ్యలక్ష్మి, కౌటాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన ఇప్ప ధరణి, తాను సికిల్ సెల్ వ్యాధితో బాధపడుతున్నానని, చికిత్స కొరకు ఆర్థిక సాయం అందించాలని రెబ్బెన మండలం దేవుల గూడా గ్రామానికి చెందిన జర్పుల సౌమ్య పల్లవి దరఖాస్తులు అందజేశారు. బిల్లులు చెల్లించాలని, పట్టా భూమిని తన పేరిట మార్చాలని, ఆక్రమణల నుంచి భూములు, భూమిని విరాసత్ చేయాలని కోరుతూ పలువురు దరఖాస్తు అందజేశారు. 

పరిహారం అందించండి

నస్పూర్: ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన పేరోజ బాను తన భర్త సౌదీ అరేబియా దేశానికి ఉపాధి కోసం వెళ్లి ఇటీవల ఇంటికి వచ్చాడని, వచ్చిన నెల రోజులకే క్యాన్సర్ తో మృతి చెందారని, ప్రభుత్వ జీవో 216 ప్రకారం పరిహారం అందించాలని కోరింది.

 ఇందిరమ్మ ఇండ్లు, తమ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని దాన్ని రద్దు చేయాలని, తదితర సమస్యలపై ప్రజలు దరఖాస్తులు అందజేశారు. అనంతరం రెవెన్యూ శాఖ సంబంధించిన కొత్త సంవత్సరం డైరీని అధికారులు, చెన్నూర్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ డి.చంద్రకళతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను వెంటనే పరిష్కరించాలి

నిర్మల్: ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించా లని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇండ్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. శాఖల వారీగా పెండింగ్​లో ఉన్న దరఖాస్తులు, సీఎం ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.