
ఆసిఫాబాద్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సినిమా, సీరియల్స్ షూటింగ్ చేయాలని కలెక్టర్ వేంకటేశ్ ధోత్రే కోరారు. ఇక్కడ అందమైన అడవులు, సింగరేణి గనులు, జలపాతాలు, చారిత్రక అవశేషాలు, కొండలు చాలా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో భారత్ కల్చరల్ అకాడమీ, ఓం సాయి తేజ ఆర్ట్స్ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సినీ, టీవీ రచయితలు, దర్శకుల శిక్షణ శిబిరం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని కళాకారులకు టీవీ, సినీ రంగాల్లో అవకాశం కల్పించాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. బెల్లంపల్లి, గోలేటి, కాగజ్ నగర్, మంచిర్యాల ప్రాంతాల నుంచి సుమారు 90 మంది యువ రచయితలు, దర్శకులు హాజరయ్యారు. మూల కథ, కథ విస్తరణ, సంభాషణ ల ప్రాధాన్యత, నటన అనే అంశంపై సినీ దర్శకుడు ఎ.ప్రేమ్‌రాజ్, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగబాల సురేష్ కుమార్ శిక్షణనిచ్చారు.