- పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక ప్రణాళిక
ఆసిఫాబాద్ , వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పదో వన మహోత్సవం కార్యక్రమానికి మొక్కలను సిద్ధం చేశారు. పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు నర్సరీల్లో తనిఖీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 335 నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచారు. 52 లక్షల 69 వేల మొక్కలు ఈ సీజన్లో నాటేందుకు టార్గెట్ పెట్టుకున్నారు.
ముమ్మరం మొక్కలు నాటే కార్యక్రమం..
జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు, ఖాళీ ప్రదేశాలు, జాతీయ రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటనున్నారు.గత ఏడాది 34 లక్షల మొక్కలు నాటగా ఈసారి 53 లక్షలు నాటనున్నారు. వన మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అధికార యంత్రాంగం జీవం పోస్తుంది. శాఖల వారీగా ఎన్ని మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని జిల్లా కలెక్టర్ సూచించారు. అధికారులు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు.
ఇప్పటికే జిల్లాలోని 334 గ్రామ పంచాయతీల పరిధిల్లో నర్సరీల్లో 52.69 లక్షల మొక్కలను పెంచి నాటేందుకు సిద్ధం చేశారు. నర్సరీల్లో కానుగ, యాప, చింత, జామ, కర్జూర, టేకు, మామిడి, నిమ్మ, బత్తాయిలతో పాటు ఇండ్లలో నాటేందుకు పూల మొక్కలను పెంచారు. అవెన్యూ ప్లాంటేషన్, ఇళ్లలో, రోడ్ల వెంట మొక్కలు నాటేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు.
32 శాఖలకు టార్గెట్ కేటాయింపులు..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో 334 గ్రామపంచాయతీలతో పాటు మునిసిపాలిటీల్లో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వి సిద్ధం చేస్తున్నారు.. అందులో భాగంగానే 32 శాఖలకు లక్ష్యాలను కేటాయించారు. ఏ శాఖ ఎన్నెన్ని మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని వారీకి అప్పగించారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసి కార్యక్రమం విజయవంతం కోసం దిశానిర్ధేశం కూడా చేశారు.
జిల్లాలో ఆయా శాఖల వారీగా టార్గెట్
మొక్కలు నాటడంలో జిల్లాలో ఆయా శాఖలకు బాధ్యతలు అప్పగించారు. అటవీ శాఖ 10.38 లక్షల మొక్కలు, డీఆర్డీవో 35 లక్షలు, వ్యవసాయ శాఖ 30 వేలు, ఎన్ సీసీఎల్ 2 లక్షలు, ఎక్సైజ్ శాఖ 38 వేలు, హార్టికల్చర్ 20 వేలు, పోలీస్ 15 వేలు, మున్సిపల్ 2.74 లక్షలు, వీరితో పాటు వివిధ శాఖల వారికి 1000కి పైగానే మొక్కలు నాటాలని అధికారులు ఆదేశించారు.