
ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో ప్రధానమంత్రి శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి తో కలిసి పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు.
పాఠశాల్లో అదనపు గదులు, టాయిలెట్ , ప్రహరీ నిర్మాణం, తాగునీటి సౌకర్యం, సైన్స్ ల్యాబ్, ఫ్యాన్లు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ఇంజినీరింగ్ అధికారులు, విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రతి పనికీ తప్పనిసరిగా డాక్యుమెంట్లు ఉండాలన్నారు.
ఓటు హక్కు వినియోగించుకోవాలి
ఆసిఫాబాద్ : మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న ఉదయం 8 గం. నుంచి పోలింగ్ ఉంటుందని, ఆ రోజు సెలవు ప్రకటించామని తెలిపారు.