చిరుధాన్యాల మార్కెట్ ను అభివృద్ధి చేయాలి : వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: పోషక విలువలున్న చిరుధాన్యాల మార్కెట్​ను మరింత అభివృద్ధి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాజరాజేశ్వరి మిల్లెట్ యూనిట్ ను, రెబ్బెన మండలం దేవులవాడలో సెర్ప్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మామ్స్ మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్​ను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి కలెక్టర్​ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిరుధాన్యాల్లో అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటాయని, అంగన్ వాడీ కేంద్రాలకు పంపిణీ చేయడం ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సకాలంలో పౌష్టికాహారం అందుతుందని తెలిపారు.

యూనిట్ నిర్వహణకు పెట్టుబడి, పని చేస్తున్న వర్కర్లు, అంగన్​వాడీలకు చేస్తున్న పంపిణీ వివరాలను పరిశీలించి మార్కెట్​ను మరింత అభివృద్ధి చేసేలా కృషి చేయాలని తెలిపారు. దేవులవాడ యూనిట్​లో తయారు చేస్తున్న చిరుధాన్యాల బిస్కెట్లు, స్నాక్స్, కేకులను పరిశీలించారు. రూ.63.25  లక్షల వ్యయంతో యూనిట్​ను ఏర్పాటు చేశారని, ఈ యూనిట్ ద్వారా చిరుధాన్యాల ఉత్పత్తుల మార్కెట్​ను మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, రిపేర్లను పరిశీలించారు.