ఆదిలాబాద్/నిర్మల్/ కాగజ్‌నగర్/ఆదిలాబాద్‌టౌన్/జన్నారం, వెలుగు: ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలులో భాగంగా జిల్లాలో కొనసాగుతున్న సభల్లో అర్హుల జాబితాలో పేర్లు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. బుధవారం కాగజ్ నగర్ మండలం వంజరిలో నిర్వహించిన గ్రామసభలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించనున్నట్లు తెలిపారు.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆదిలాబాద్ లెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణం 40వ వార్డు జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన గ్రామసభలో పాల్లొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 5,359, రేషన్ కార్డులు 14,019, ఆత్మీయ భరోసా కోసం 4,528, రైతు భరోసా కోసం 38 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. మున్సిపల్ కమిషనర్ రాజు, ప్రత్యేక అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలను అందించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని కిసాన్ కాంగ్రెస్రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మావల, కేఆర్కే కాలనీల్లో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలు గ్రామసభలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
గ్రామసభల్లో గందరగోళం
గ్రామ సభల్లో రెండో రోజు కూడా పలుచోట్ల గందరగోళం నెలకొంది. తాంసి మండలంలోని వడ్డాడీలో అనర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారంటూ గ్రామస్తులు అధికారులను నిలదీశారు. కాసేపు ఉద్రిక్తత నెలకొనడం ఆదిలాబాద్ డీఏస్పీ జీవన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులను సముదాయించారు. గుడి హత్నూర్ మండలంలో సీతాగొందిలో ప్రజాపాలన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఫోటో పెట్టలేదని అక్కడి బీఆర్ఎస్ నాయకులు అధికారులతో వాదనకు దిగారు. దీంతో కొద్దిసేపు గ్రామసభ ఆగిపోయింది. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని జన్నారం మండలంలోని రేండ్లగూడ, పొనకల్లో జరిగిన గ్రామసభల్లో ప్రజలు ఆఫీసర్లతో వాగ్వాదానికి దిగారు.
దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. పేర్లు రాని వారు మరోసారి ఇదే సభలో దరఖాస్తులిస్తే తప్పుకుండా న్యాయం చేస్తామని అధికారులు హమీ ఇవ్వడంతో వారు శాంతించారు. కామన్పల్లిలో సరైన సమాచారం లేకుండానే ఆఫీసర్లు గ్రామసభను నిర్వహించారని నాయకపుగూడ ప్రజలు ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం గొల్లమాడ, కుంటాల మండలం దౌనెల్లిలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే లిస్టుతోపాటు రేషన్ కార్డుల జాబితాలో పేర్లు లేనివారు అధికారులను నిలదీ శారు. అర్హులైన పేదలకు జాబితాలో చోటు దక్కలేదని మామడ మండలం న్యూ లింగంపల్లి గ్రామసభలో ప్రజలు మండిపడ్డారు.