ఆసిఫాబాద్/కాగజ్ నగర్: వెలుగు: అగ్ని ప్రమాదాల నుంచి ఆస్తులను రక్షించుకుందామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన అగ్నిమాపక వాహనాన్ని బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అగ్నిమాపక అధికారి సురేశ్ తో కలిసి కలెక్టర్ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఆసిఫాబాద్ అగ్నిమాపక కేంద్రానికి నూతన వాహనాన్ని కేటాయించిందని, దీంతో కేంద్రంలో 2 వాహనాలు అందుబాటులో ఉంటాయని, కాగజ్ నగర్ కేంద్రంలో మరో వాహనం ఉందని తెలిపారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాల నివారణకు, ప్రజల ఆస్తుల రక్షణకు కృషి చేయాలన్నారు.
బేటీ బచావో–బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
బేటీ బచావో-బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలి కలెక్టర్ ధోత్రే సూచించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి చేపట్టిన ర్యాలీని సంక్షేమ శాఖ అధికారి భాస్కర్‌తో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చ్ 8 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆడపిల్లలను బతికించుకుందామని, వారిని చదివించుకుని వారి హక్కులను కాపాడుకుందామని, బాలికలను స్వేచ్ఛగా ఎదగనిద్దామని పిలుపునిచ్చారు.
కాగజ్ నగర్ మున్సిపల్ అభివృద్ధికి చర్యలు
అమృత్ 2.0 కింద ఎంపికైన కాగజ్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. సర్వే ఆఫ్ ఇండియా అధికారులు డ్రోన్ ద్వారా కాగజ్ నగర్ పట్టణాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యే హరీశ్ బాబుతో కలిసి ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ అంజయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
.