ఇక్కడ పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా : కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే

  •     ఆసిఫాబాద్ కొత్త కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే

ఆసిఫాబాద్, వెలుగు :  ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రం భీం పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా కొత్త కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం ఆసిఫాబాద్​కలెక్టర్​గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అడిషనల్ కలెక్టర్​దీపక్ తివారితో కలిసి కెరమెరి మండలంలోని జోడేఘాట్ గ్రామాన్ని సందర్శించి కుమ్రం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం కుమ్రం భీం స్మారక మ్యూజియాన్ని సందర్శించి ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనలో అణిచివేతకు గురైన ఆదివాసుల హక్కుల సాధన కోసం వీరోచిత పోరాటం చేసి అమరుడైన కుమ్రం భీం  జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. ఇలాంటి పోరాట యోధుడి గడ్డపై పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని, జిల్లాలోని ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కలెక్టర్​ వెంట డీటీడీఓ రమాదేవి, అసిస్టెంట్ క్యూరేటర్ దుందేరావు, తహసీల్దార్ దత్తు ప్రసాద్, ఎంపీడీఓ కృష్ణారావు, ఎంపీపీ పెందోర్ మోతిరామ్ తదితరులు 

పాల్గొన్నారు. సాయంత్రం కలెక్టరేట్​లో జరిగిన  మీడియా సామావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అన్ని శాఖల అధికారుల సమన్యాయంతో ఆసిఫాబాద్ జిల్లాను అభివృద్ధి చేసి నంబర్ వన్​గా తీర్చిదిద్దుతామన్నారు. గవర్నమెంట్ అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్​లను ప్రజలకు అందేలా ప్రత్యేకం కృషి చేస్తానని చెప్పారు. విద్య, వైద్యం, సంక్షేమమే తన లక్ష్యమన్నారు. సమస్యలు, అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకుంటానన్నారు.