సూర్యాపేట, వెలుగు : జిల్లాలోని అటవీ భూమికి హద్దులను పాతాలని అటవీ పరిరక్షణ కమిటీ చైర్మన్, కలెక్టర్ వెంకట్‌రావు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతలపాలెం రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉన్న డిస్-రిజర్వ్ చేయబడిన భూములను గుర్తించి హద్దులు నిర్ణయించాలని సూచించారు. హద్దులు లేకపోవడంతో గ్రామస్తులు అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
జాన్ పహాడ్ దగ్గర సాగర్ కాలువకు ఇరువైపులా ఉన్న అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, సర్వే చేసి తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. కృష్ణా నదిలో నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేయాలని అటవీ, మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. పన్నులు చెల్లించకుండా అనధికారికంగా నడుపుతున్న వాహనాలను గర్తించి చర్యలు తీసుకోవాలని ఆర్టీవో సురేశ్ రెడ్డికి సూచించారు. ఎస్పీ రాహుల్ హెగ్డే, అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, డీటీడబ్ల్యూవో శంకర్, ఆర్టీవో సురేష్ రెడ్డి, జిల్లా మైనింగ్ అధికారి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు మీడియా సహకరించాలి
పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు మీడియా సహకారం అందించాలని కలెక్టర్ వెంకట్‌రావు కోరారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను బుధవారం ఎస్పీ రాహుల్ హెగ్డే కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశామని చెప్పారు.
వార్తా పత్రికలు, ఈ-పేపర్‌లు, టెలివిజన్ ఛానెల్‌లు, స్థానిక కేబుల్ నెట్‌వర్క్‌లు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో, -వీడియో విజువల్స్ ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాత విడుదల చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. డైరెక్ట్ యాడ్స్, పెయిడ్ ఆర్టికల్స్ నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వైరల్ చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు.