సూర్యాపేట, వెలుగు: ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిచనున్నట్లు కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ తెలిపారు. యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లపై గురువారం కలెక్టరేట్ లో ఆయా శాఖల అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లు, సీఈవోలు, ఐకేపీ అధికారులు, సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏప్రిల్ 1 నుంచి ప్రతి మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో 3.82.545 విస్తీర్ణంలో రైతులు వరి పండించారని, 8.62,617 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు తెలిపారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో 63 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 158, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం 'ఏ' గ్రేడ్ క్వింటాల్‌కు రూ.2203, సాధారణ రకానికి రూ.2183 ధర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.
ఏప్రిల్ 1 నుంచి 18 వరకు అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం జరగకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, డీఎస్ వో మోహన్ బాబు, డీఆర్డీవో మధుసూదన్ రాజు, డీసీవో పద్మ, డీఏవో శ్రీధర్ రెడ్డి, ఆర్డీవోలు సూర్యనారాయణ, వేణుమాధవ్, డీఎంవో శర్మ, తహసీల్దార్లు, ఐకేపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సోషల్ మీడియాపై నిఘా పెంచాలి
సూర్యాపేట, వెలుగు : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వార్తలపై నిఘా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ బీఎస్ లతతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగామ్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ తదితర సామాజిక మాద్యమాల్లో ప్రచారం ఎక్కువగా జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సోషల్ మీడియా ఐటమ్స్ పై ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ చర్యలు తీసుకుంటామన్నారు.
ఫిర్యాదుల కేంద్రం నుంచి యంత్రాంగం ఇంటర్నెట్ బేస్డ్ మీడియాల్లో వచ్చే ఎన్నికల ప్రచారాలపై పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సోషల్ మీడియాలో వచ్చే వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అప్పారావు, డీపీఆర్వో రమేశ్‌కుమార్, డీఈ మల్లేశం, ఏవో సుదర్శన్ రెడ్డి, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాస రాజు, సోషల్ మీడియా ట్రాకింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.