సూర్యాపేట, వెలుగు: జిల్లాలోని 584 స్కూళ్లలో అమ్మ ఆదర్శ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్‌రావు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వెబెక్స్ ద్వారా డీఆర్‌డీవో, డీఈవో, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఎంఈవోలు, ఏపీఎంలతో వీడియో కాన్పిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లలో మౌలిక వసతుల కల్పించేందుకు ప్రభుత్వం అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు ఈ కమిటీలకు ప్రెసిడెంట్‌గా, విద్యార్థుల తల్లిదండ్రులు సభ్యులుగా, హెచ్‌ఎం కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ కమిటీల పదవీ కాలం రెండేళ్లు ఉంటుందన్నారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, శానిటేషన్, యూనిఫామ్ కుట్టు పనిని పర్యవేక్షిస్తాయని చెప్పారు. 18 నుంచి మొదలు కానున్న టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. జిల్లాలో తాగునీరు సమస్య లేకుండా చూడాలని, ఎక్కడైనా సమస్య ఉంటే 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలనిఆదేశించారు.