
కందనూలు , వెలుగు: భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట్, బిజినేపల్లి మండల కేంద్రంలోన రైతు వేదికలో ఏర్పాటుచేసిన భూ భారతి చట్టం -2025 అవగాహన సదస్సుకు సోమవారం ముఖ్య అతిథిగా ఇన్‌చార్జి కలెక్టర్ విజయేందిర బోయి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందన్నారు. భూ భారతి చట్టం ద్వారా పక్కగా భూ సరిహద్దులు నిర్ణయిస్తాయన్నారు. బిజినేపల్లిలో అదనపు కలెక్టర్ అమరేందర్ భూభారతి చట్టంపై వివరంగా ప్రజలకు తెలియజేశారు. సమావేశంలో ఆర్డీవో సురేశ్, తహసీల్దార్ శ్రీరాములు, ఏవో లు నీతి, కమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
భూ భారతితో ప్రతి రైతుకు భరోసా..
మాగనూర్, వెలుగు: భూ భారతి చట్టం ద్వారా ప్రతి రైతుకు భరోసా,భద్రత ఉంటుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. రైతుల మేలు కోసమే ధరణి స్థానంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకువచ్చిందని, రైతులందరూ చట్టంపై అవగాహన పెంచుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని వారు సూచించారు. సోమవారం కృష్ణా, మాగనూర్ మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా రైతులకు సంబంధించిన అన్ని భూ సమస్యలను పరిష్కరించడమే కాకుండా, వారికి భూధార్ కార్డును ఇస్తామన్నారు.
మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ఒకప్పుడు రైతులే తహసీల్దార్ వద్దకు వెళ్లాల్సి ఉండేదన్నారు. ఇప్పుడు తహసీల్దార్, మిగతా రెవెన్యూ ఆఫీసర్లు రైతుల వద్దకే వచ్చి సమస్యలపై దరఖాస్తులు తీసుకుంటారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కృష్ణా, మాగనూర్ మండలాల ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, సురేశ్, వెంకటేశ్, జానయ్య, రహమతుద్దీన్, రెవెన్యూ అధికారులు, రైతులు పాల్గొన్నారు.