
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : వృత్తి నైపుణ్యం స్వయం ఉపాధి శిక్షణా కార్యక్రమాలు వినియోగించుకుని మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన మహబూబ్ నగర్ ఫస్ట్ నవరత్నాలు అనే వృత్తి నైపుణ్య శిక్షణ కార్యక్రమం మొదటి బ్యాచ్ ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శిక్షణ మొదటి బ్యాచ్ లో 224 మంది మహిళలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని అన్నారు.
నవరత్నాలు ద్వారా 9 రకాల కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వృత్తి నైపుణ్య శిక్షణ పొందిన 224 మంది మహిళలు మహబూబ్ నగర్ రోల్ మోడల్స్ అని కొనియాడారు. అనంతరం శిక్షణ పొందిన మహిళలకు మెమెంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి, ఎమ్మెల్యే సతీమణి లక్ష్మీ ప్రసన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, పరిశ్రమల శాఖ జి.ఎం.ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
బీసీ గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్
హన్వాడ, వెలుగు : మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం రాత్రి హన్వాడ మండలం లోని జ్యోతి బా పూలే తెలంగాణ బీసీ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. అక్కడే రాత్రి బస చేశారు. భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. తర్వాత కిచెన్, స్టోర్ రూం పరిశీలించారు.
తాజా కూర గాయలతో మెనూ ప్రకారం భోజనం అందించాలని అన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ నర్సింహులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి జరీనా బేగం, భూ గర్భ జల వనరుల శాఖ డీడీ రమాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర ఉన్నారు.