
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో క్షయ వ్యాధి నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ క్షయ దినం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,087 మందిలో టీబీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించి 1,218 మందికి చికిత్స అందించి వ్యాధిని నయం చేసినట్లు తెలిపారు. 1,767 మంది వ్యాధి లక్షణాలు ఉన్న వారికి రూ.వెయ్యి చొప్పున ఆరు నెలల పాటు అందించినట్లు చెప్పారు.
టీబీ పరీక్షలు నిర్వహించేందుకు డీఎఫ్ఎంటీ నిధుల ద్వారా పోర్టబుల్ ఎక్స్ రేకు రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. టీబీ లక్షణాలు కనిపించిన వారు పీహెచ్సీ, సబ్ సెంటర్లలో సంప్రదించి చికిత్స తీసుకోవాలని కోరారు. టీబీ రోగులకు అందించిన సేవల్లో జిల్లా మొదటి స్థానంలో నిలవడంతో టీబీ నియంత్రణ అధికారి, వైద్య సిబ్బందిని అభినందించారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, డీఎంహెచ్వో కె కృష్ణ, జిల్లా టీబీ నియంత్రణ అధికారి మల్లికార్జున్, ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్ కుమార్, శశికాంత్, డీడబ్ల్యూవో జరీనా బేగం, పల్మనాలజినిస్ట్ శరత్ చంద్ర పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: క్షయ వ్యాధి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి కోరారు. సోమవారం పాత కలెక్టరేట్ ఆవరణలో ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. లక్షణాలు కనిపించిన వారు చికిత్స తీసుకొని వ్యాధిని నయం చేసుకోవచ్చని చెప్పారు. డిప్యూటీ డీఎంహెచ్వో వెంకట దాస్, ప్రోగ్రాం ఆఫీసర్ రవికుమార్ పాల్గొన్నారు.
నారాయణపేట: క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ వీసీ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 14,707 పరీక్షలు నిర్వహించి, 903 కేసులు గుర్తించామని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్తులకు భీష్మరాజ్ ఫౌండేషన్ తరపున అందిస్తున్న ఉచిత కిట్లను కలెక్టర్ అందజేశారు. అంతకుముందు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని
సూచించారు.