
మహబూబ్ నగర్, కలెక్టరేట్, వెలుగు: ఉదండపూర్ రిజర్వాయర్ నిర్వాసిత కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్, సర్యే ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉదండాపూర్ రిజర్వాయర్ కింద వల్లూరు, ఉదండపూర్, తుమ్మల కుంట తండా, రేగడి పట్టి తండా, చిన్నగుట్ట తండా, శామ గడ్డ తండా,ఒంటి గుడిసె తండా, పోలేపల్లి భూములు కోల్పోయారని తెలిపారు.
ఆ కుటుంబాలకు పునరావాసం కింద మూడు వందల గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. నిర్వాసితుల అవసరాలకు అనుగుణంగా ప్రైమరీ హెల్త్ సెంటర్, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వెటర్నరీ హాస్పిటల్, కమ్యూనిటీ హాల్స్, పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రిజర్వాయర్ అర్ ఆండ్ ఆర్ విషయంలో ఏమైనా సమస్యలు వుంటే ఆర్డీవో దృష్టికి తీసుకు రావాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచించారు. ఈ సమావేశం లో లాండ్ అక్యువేషన్ స్పెషల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఆర్డీవో నవీన్, ఇరిగేషన్, మిషన్ భగీరథ పాల్గొన్నారు.