మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: ఉద్యోగావకాశాలు మెరుగు పర్చుకోవడంతో పాటు తమ నైపుణ్యాలను పెంపొందించుకొనేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్ ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ సెంటర్ ను టాస్క్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ తో కలిసి పరిశీలించారు. ఈ కేంద్రం ద్వారా టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
సర్వే డేటా కరెక్ట్ గా అప్ లోడ్ చేయండి
ఇందిరమ్మ ఇండ్ల సర్వే వివరాలు తప్పులు లేకుండా మొబైల్ యాప్ లో అప్ లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలోని క్రిస్టియన్ కాలనీలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాల నమోదును పరిశీలించారు. సర్వేలో ఎదురవుతున్న సమస్యలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు.