మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాలు వినూత్న ఆలోచనలతో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు చేపట్టి మహబూబ్ నగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. శనివారం కలెక్టరేట్ లో గ్రామ సంఘాలు, మండల మహిళా సమాఖ్యల కొత్త బైలాస్ పై డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు కొత్త అలోచనలతో వ్యాపారం చేసి ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు.
బ్యాంక్ లింకేజి కింద నిర్దేశించిన లక్ష్యాన్ని జనవరి 15 నాటికి పూర్తి చేయాలన్నారు. బ్యాంక్ లింకేజి కింద ఆర్థికసాయం అందించడంలో జిల్లా వెనకబడి ఉందని, రూ.381 కోట్లకు గాను, రూ.280 కోట్ల రుణాలు అందించినట్లు పేర్కొన్నారు. కమ్యూనిటీ పెట్టుబడి నిధి, స్త్రీ నిధి రుణ రికవరీ మెరుగుపర్చాలని సూచించారు. మహిళా శక్తి కార్యక్రమం కింద ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. అనంతరం మహిళా శక్తి కార్యక్రమం కింద చేపట్టిన కార్యక్రమాలపై మండలాల వారీగా రివ్యూ చేశారు. సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా యూనిట్లు గ్రౌండింగ్ చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఆర్డీవో నర్సింహులు పాల్గొన్నారు.