చిన్నచింతకుంట, వెలుగు: ఈ నెల 31 నుంచి నవంబర్ 18 వరకు జరుగనున్న కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ విజయేందిరబోయి ఆదేశించారు. గురువారం అమ్మాపూర్ లో వెలిసిన కురుమూర్తి స్వామి టెంపుల్ ఆవరణలో సమన్వయ కమిటి సమావేశంలో మాట్లాడారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఎలాంటి ఇబ్బందులు రాకుండా వివిధ కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కమిటీలు వారికి కేటాయించిన విధులను తప్పకుండా నిర్వహించాలన్నారు. ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూం 24 గంటలు పని చేసే విధంగా సిబ్బందిని నియమించాలన్నారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను సక్సెస్ చేయాలని అధికారులను కోరారు.
ఎస్పీ డి.జానకీ, అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఆర్డీఓ నవీన్ టెంపుల్ చైర్మన్ గోవర్ధన్ , డీఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ పద్మ, ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, డీపీఓ పార్ధసారథి, పిఆర్ ఎఈ నరేందర్ రెడ్డి, టెంపుల్ ఈఓ నరేందర్ రెడ్డి, ఆఫీసర్ మధునేస్వర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.