ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

నల్గొండ అర్బన్, వెలుగు : జిల్లాలో ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్​ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం మంత్రి హరీశ్​రావు తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో జిల్లాలో ఏర్పాట్ల గురించి వివరించారు. ‘కంటి వెలుగు’ కోసం జిల్లా వ్యాప్తంగా 74 టీమ్​లు, రిజర్వ్ లో  4 టీమ్ లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ నెల 12 లోగా జిల్లా మంత్రి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించి ‘కంటి వెలుగు’ క్యాంప్ లు నిర్వహించే లొకేషన్ నిర్ణయిస్తామని తెలిపారు.  జడ్పీ చైర్మన్​ బండ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు  కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్, అడిషనల్​కలెక్టర్ ఖుష్బూ గుప్తా, మున్సిపల్ చైర్మన్ ఎం. సైదిరెడ్డి, డీఎంహెచ్​వో డాక్టర్ కొండల్ రావు తదితరులు పాల్గొన్నారు. 

గుట్టలో రెండో రోజు ఘనంగా అధ్యయనోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు మంగళవారం స్వామివారు ఉదయం వేణుగోపాలస్వామి, సాయంత్రం గోవర్థనగిరిధారి అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రధానాలయ తిరువీధుల్లో స్వామివారిని ఊరేగించారు. ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కాగా, మూడో రోజైన బుధవారం ఉదయం స్వామివారు రామావతారం, సాయంత్రం వెంకటేశ్వరస్వామిగా దర్శనమివ్వనున్నారు.  

20 రోజుల హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రికార్డుస్థాయి హుండీ ఆదాయం నమోదైంది. మంగళవారం 20 రోజుల హుండీ లెక్కించగా రూ.2,12,16,700 ఆదాయం సమకూరిందని ఈఓ గీతారెడ్డి తెలిపారు. ఇది యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలోనే అత్యధిక ఆదాయమని ప్రకటించారు. గత ఏడాది అక్టోబర్ 11న 28 రోజుల హుండీ లెక్కించగా రూ.1.89 కోట్లు వచ్చాయని, నవంబర్ 24న 15 రోజుల హుండీ ఆదాయం రూ.1.88 కోట్లుగా నమోదైందన్నారు. మంగళవారం మాత్రం మునుపెన్నడూ లేనివిధంగా 20 రోజుల్లోనే రూ.2.12 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.  ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత నడుమ హుండీలను కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్ కు లెక్కించగా రూ.2,12,16,700 నగదు, 167 గ్రాముల బంగారం, 2 కిలోల 600 గ్రాముల వెండి వచ్చింది. 1194 అమెరికన్​డాలర్లు, 140 యూఏఈ దిర్హామ్స్, 150 ఆస్ట్రేలియన్​డాలర్లు, 30 పౌండ్లు, 75 కెనడియన్​డాలర్లు, 10,500 బైసా, 45 న్యూజిలాండ్​డాలర్లు,  74 సింగపూర్ డాలర్లు, 69 మలేషియన్​ రింగిట్స్, 25 సౌదీ రియాల్స్ వచ్చాయి.

మునుగోడులో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తాం

చౌటుప్పల్/మర్రిగూడ, వెలుగు: రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉన్నాయని, కానీ నేడు 102 ఉన్నాయని మంత్రి హరీశ్​రావు చెప్పారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్, నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని మంత్రి జగదీశ్​రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు చౌటుప్పల్​లో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని, క్యాన్సర్ పేషంట్ల కోసం పాలియేటివ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని నిర్మిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీబీ నగర్ లో ఎయిమ్స్ ఆస్పత్రి ఇస్తామంటే రూ. 5 కోట్ల విలువైన భూమి ఇచ్చామని, అక్కడ ఎంబీబీఎస్ చదువుకుంటున్న స్టూడెంట్లకు కేంద్ర ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులు ఒకసారి బీబీనగర్ ఎయిమ్స్ కు వచ్చి అక్కడి దుస్థితి చూడాలని విజ్ఞప్తి చేశారు. భువనగిరి ఎయిమ్స్​లో ఎమర్జెన్సీ సేవలు, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్లు, గర్భిణులకు సేవలందించేందుకు ఏవీ లేవన్నారు. ఏడాదిలో తెలంగాణలో 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, వచ్చే సంవత్సరం మరో 8 కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. చర్లగూడెం రిజర్వాయర్​లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు త్వరలో ప్లాట్లు పంపిణీ చేస్తామని, వారం రోజుల్లో స్థానిక మంత్రి, ఎమ్మెల్యేతో  హైదరాబాద్​లో  చర్చిస్తామన్నారు. సమావేశం లో రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. 

అట్రాసిటీ కేసులను స్పీడ్​గా పరిష్కరించాలి

యాదాద్రి/యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను స్పీడ్​గా పరిష్కరించేందుకు రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ లో మంగళవారం నిర్వహించిన జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ కు ఆమె హాజరై మాట్లాడారు.  గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవంపై , చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ ఆఫీసర్లకు సూచించారు.  కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మానిటరింగ్ కమిటీ మెంబర్లు  శివలింగం, సుదర్శన్,  నర్సింగరావు, తిరుమలేశ్​తదితరులు పాల్గొన్నారు. 

మోట కొండూర్ మార్కెట్ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు

 ఆలేరు, మోత్కూరు వ్యవసాయ మార్కెట్​కమిటీల పరిధిలోని కొన్ని  గ్రామాలను కలుపుతూ కొత్తగా  మోటకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో  మంత్రిని కలిసి మార్కెట్​కమిటీ ఏర్పాటుకు  ప్రపోజల్స్​ అందజేశారు. ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి మోటకొండూర్ 10 కిలోమీటర్ల దూరం ఉండడంతో  రైతులకు ఇబ్బందిగా మారిందని వివరించారు. మంత్రి  సానుకూలంగా స్పందించారని విప్ సునీత తెలిపారు. 

అవినీతిపై కంప్లయింట్​చేస్తే చర్యలేవీ?

హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ నియోజకవర్గం, మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై జిల్లా అధికారులకు ఎన్ని సార్లు కంప్లయింట్​చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజూర్ నగర్ ఎంపీ క్యాంపు ఆఫీస్​లో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. మఠంపల్లి మండలం పెడవీడు శివారులో సర్వే నెంబర్ 540 లో రూ. 100 కోట్లు విలువ చేసే 46 ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్​లీడర్లు కబ్జా చేశారని కంప్లయింట్​చేసినా.. ఆఫీసర్లు అధికార వత్తిడితో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ భూ ఆక్రమణలపై కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ కు మరోసారి కంప్లయింట్​చేస్తామని తెలిపారు.  హుజూర్ నగర్ ఆర్డీవో ప్రభుత్వ భూమి అని బోర్డ్ పెట్టినప్పటికీ ఆ బోర్డు ను తొలగించి మరీ కబ్జాకు పాల్పడ్డారని ..  దీని వెనుక ఉన్న బడా లీడర్ ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని లే అవుట్ స్థలాల డాక్యుమెంట్లు ఆఫీస్​నుంచి దొంగలించిన ఘటనలో  తాను స్వయంగా కంప్లయింట్​చేసినా  పోలీసులు  దర్యాప్తు చేయలేదని ఆరోపించారు.  మున్సిపాలిటీ లో జరిగిన అక్రమాలపై ఈ నెల 6 న పర్యటించనున్న  మున్సిపల్​మంత్రి కేటీఆర్ తో చర్చిస్తానని ఉత్తమ్ చెప్పారు. సాముల శివారెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు సంపత్ రెడ్డి,  రాజా తదితరులు పాల్గొన్నారు. 

పార్టీ నిర్మాణానికి ‘శక్తి కమిటీ’లే పిల్లర్లు

సూర్యాపేట, వెలుగు: పార్టీ నిర్మాణానికి శక్తి కమిటీలే పిల్లర్లు అని  బీజేపీ రాష్ట్ర నాయకుడు  రేవూరి ప్రకాశ్​రెడ్డి,  రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్ రావు అన్నారు. మంగళవారం  ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని నెమ్మికల్ లో జరిగిన శక్తి కమిటీల ఇన్​చార్జిల అవగాహన సమావేశం నిర్వహించారు.  హాజరైన వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ రాష్ట్రంలో అమలు చేస్తే ప్రధాని మోడీకి  మంచి పేరు వస్తుందని సీఎం అమలు చేయడం లేదన్నారు.  కేసీఆర్​మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని,  శక్తి కమిటీలు ఆ మోసాలను ప్రజలకు వివరించాలన్నారు.  బీఆర్ఎస్​నుంచి  మిడతనపల్లి మాజీ సర్పంచ్ భర్త మూరగుండ్ల గంగయ్య , వార్డు మెంబర్ పెద్ద వెంకన్న ఆధ్వర్యంలో 50 మంది బీజేపీలో చేరారు.  బీజేపీ మండల అధ్యక్షుడు రాంరెడ్డి,  కిషన్, కాప రవి, మమతారెడ్డి పాల్గొన్నారు.

నరసింహుడి సన్నిధిలో వైవీ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు : లక్ష్మీ నరసింహస్వామిని మంగళవారం ఆర్బీఐ మాజీ గవర్నర్, పద్మభూషణ్  యాగా వేణుగోపాల్ రెడ్డి (వైవీ రెడ్డి) దర్శించుకున్నారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన గర్భగుడిలో నరసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధానాలయ ముఖ మంటపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. తర్వాత అద్దాల మండపం వద్ద వైవీ రెడ్డికి అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేష వస్త్రాలు అందజేశారు.  ఆలయ ఏఈవో రామ్మోహన్, సూపరింటెండెంట్  రాజు, రాంప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. 

రేంజర్ల రాజేశ్​పై పీడీ యాక్ట్ పెట్టాలి

యాదగిరిగుట్ట, వెలుగు: సరస్వతీదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేంజర్ల రాజేశ్​పై పీడీ యాక్ట్ నమోదు చేసి శిక్షించాలని రాష్ట్ర ఆలయ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేశ్​బాబు డిమాండ్ చేశారు. రాజేశ్​వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం యాదగిరిగుట్టలో ఆలయ ఉద్యోగుల నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  రమేశ్​బాబు మాట్లాడుతూ.. ఇటీవల హిందూ దేవుళ్లపై కొందరు అసభ్యకరమైన రీతిలో మాట్లాడుతుండడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది హిందువులపై జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. ఆలయ ఉద్యోగులు జూషెట్టి కృష్ణ గౌడ్, డీఈ మహిపాల్ రెడ్డి, సూపరింటెండెంట్ శ్రీకాంత్, సింగ్ పాల్గొన్నారు. 

డిగ్రీ స్టూడెంట్ మిస్సింగ్

హుజూర్ నగర్, వెలుగు:  పట్టణంలోని తిలక్​నగర్​కాలనీలో  ఓ డిగ్రీ స్టూడెంట్ అదృశ్యమైంది. ఎస్సై కట్టా వెంకట్​రెడ్డి వివరాల ప్రకారం.. కాలనీకి  చెందిన కోలపూడి కవిత(21)  ఖమ్మంలోని ఎస్ఆర్ఎండీ కాలేజీ లో డిగ్రీ ఫస్ట్​ఇయర్​చదువుతోంది. ఇటీవల కాలేజీకి వరుసగా  సెలవుల రావడంతో ఇంటికి వచ్చింది. మంగళవారం కుటుంబ సభ్యులు రోజు లాగానే వారి పనులకు బయటకు వెళ్లారు. అనంతరం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులకు కవిత కనిపించలేదు.  బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో కవిత తండ్రి కొలపూడి కమలాకర్ పోలీసులకు కంప్లయింట్​ చేశారు. కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.