ఖమ్మం, వెలుగు : ధరణి పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్, కలెక్టరేట్, ధరణి పర్యవేక్షకులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంపై ఈనెల 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు చెప్పారు. జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ కు ముందు 10,265 ధరణి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇప్పటివరకు క్షేత్ర, రికార్డ్స్ నమోదు పరిశీలనల అనంతరం ప్రత్యేక డ్రైవ్ లో 1300 దరఖాస్తులు పరిష్కరించినట్లు చెప్పారు. వీటిలో 800 దరఖాస్తులను ఆమోదించి, రైతులకు పాస్ బుక్ ల జారీకి సిఫారసు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆర్డీవో, కలెక్టరేట్ కార్యాలయాల్లో ఆదివారం కూడా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి సుమారు 510 దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు.
మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులు, జిల్లా స్థాయిలో కలెక్టరేట్ లోని పర్యవేక్షకులతో పరిశీలన చేయించనున్నట్లు చెప్పారు. మావేశంలో అడిషనల్ కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, కలెక్టరేట్ ఏవో అరుణ, పర్యవేక్షకులు మదన్ గోపాల్, మీనన్, సత్యనారాయణ, రాంబాబు, ఓఎస్డీ నాగేశ్వరరావు, ధరణి కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.