ఎన్నికల నిర్వహణలో లోపాలు ఉండొద్దు  : కలెక్టర్ గౌతమ్

ఖమ్మం టౌన్, వెలుగు : ఎన్నికల నిర్వహణలో లోపాలు లేకుండా సమర్థవంతంగా విధులు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం న్యూ కలెక్టరేట్ లోని మీటింగ్​ హాల్​లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి ఏఆర్ఓ, డీఎస్పీ, ఏసీపీ, నోడల్ అధికారులతో లోక్ సభ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టీ బృందాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు.  నిఘా బృందాలు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధులు సక్రమంగా చేయాలన్నారు.  

క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని,  ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, రిసెప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు చూసుకోవాలని సూచించారు. సీ విజిల్ పై అందిరికీ అవగాహన కల్పించాలన్నారు. 85 ఏండ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు హోం ఓటింగ్ కోసం ఫారం 12డీలను ఇంటింటికీ అందజేయాలని చెప్పారు.

 సీపీ మాట్లాడుతూ స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమ నగదు, లిక్కర్, ప్రలోభాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టీ, 15 ఎస్ఎస్టీ, 2 ఇంటిగ్రేటెడ్,10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రచార సామగ్రిపై ప్రచురణకర్త పేరు, వివరాలు లేకుంటే సీజ్ చేయాలన్నారు.

సమావేశంలో అడిషనల్​ కలెక్టర్లు బీ. సత్యప్రసాద్, డీ. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణా ఐపీఎస్ పీ. మౌనిక, అడిషనల్​ డీసీపీ ప్రసాద రావు, భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్​ కలెక్టర్ వేణుగోపాల్, ఎస్డీసీ ఎం. రాజేశ్వరి, ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం ఆర్డీవోలు గణేశ్, శ్రీనివాస్, మధు, డీసీవో మురళీధర్ రావు, ఐటీ అధికారి సాయి కుమార్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి కే. శ్రీరామ్, తదితరులు పాల్గొన్నారు. 

తాగునీటి సమస్య లేకుండా చూడాలి

జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం న్యూ కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎంపీడీవో, పీఆర్ డబ్ల్యూఎస్ ఇంజినీనర్లతో తాగునీటి సరఫరాపై ఆయన సమీక్షించారు. జలాశయాల్లో నీటి లభ్యత తగ్గుతోందన్నారు. తాగునీటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

పట్టణ ప్రాంత పరిధిలో 804 బోర్లు, 151 పంప్ లు పనిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంత పరిధిలో 1627 బోర్లు, 7199 పంప్ లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వేసవి తీవ్రత దృష్ట్యా ముందు ముందు ఏ ఏ ప్రాంతాల్లో ఎంత మేర నీటి లభ్యత ఉంటుందో నివేదిక ఇవ్వాలని సూచించారు. బోర్ల రిపేర్లతోపాటు ప్రయివేటు నీటి వనరులు లీజుకు తీసుకోవాడం లాంటి చేయాలన్నారు.