పెండింగ్ ​పనులపై ఫోకస్!​ .. బ్లాక్​ లిస్ట్ లో పెడతామని కలెక్టర్​ వార్నింగ్

  • బీఆర్ఎస్​ లీడర్లే బినామీ కాంట్రాక్టర్లు?
  • టెండర్ ​దక్కించుకున్న వారిని పక్కనబెట్టి పనులు
  • అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో అరాచకం!
  • అన్ని అసంపూర్తి పనులు.. ఆగమాగం..

ఖమ్మం/ నేలకొండపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లాలోని పెండింగ్​పనులపై ఆఫీసర్లు స్పెషల్​ ఫోకస్​ పెడుతున్నారు. అభివృద్ధి పనులను త్వరగా కంప్లీట్​ చేయని వారిని బ్లాక్​ లిస్ట్ లో పెడతామని ఇప్పటికే ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్​​ స్ట్రాంగ్​ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేల సపోర్టుతో కొందరు లీడర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.  టెండర్లు దక్కించుకున్న వారిని బెదిరించి మరీ పనులు తీసుకుని సబ్​ కాంట్రాక్టర్ల పేరుతో నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారు. అలాంటి వారిని ఆఫీసర్లు గుర్తించి ఆ పనులను గాడిలో పెడుతున్నారు. గడువు దాటినా పనులు పూర్తి చేయకుండా, గత ఆర్నెళ్ల నుంచి ఎక్కడి పనులు అక్కడే ఉంచి నిర్లక్ష్యం చేయడంపై చర్యలకు సిద్ధమవుతున్నారు. 

బినామీలు ఇక్కడే ఎక్కువ!

ఎక్కువగా ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​ నేతలు బినామీ పేర్లతో కాంట్రాక్టు వర్కులు తీసుకున్నారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ పనులను రెండేళ్లుగా సాగదీస్తుండడంపై ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస​ రెడ్డి ఫైర్​ అయ్యారు. పనులను పరిశీలించి కాంట్రాక్టర్​ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం బౌద్ధ స్తూపం దగ్గర విశ్రాంతి గదుల నిర్మాణ పనులను రీసెంట్ గా కలెక్టర్​ పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు వెంటనే కంప్లీట్ చేయకపోతే చర్యలు తప్పవని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. 

ఏండ్లు గడుస్తున్నా.. ముందుకుసాగని పనులు

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చెందిన రూ.90లక్షల నిధులతో ముజ్జుగూడెంలో ఆరు గదులతో వసతి గృహాలను నిర్మిస్తున్నారు. అక్కడ వందల ఏండ్ల చరిత్ర కలిగిన బౌద్ధ స్తూపాన్ని సందర్శించేవారి కోసం ఈ గదులను నిర్మిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఈ పనులు కొనసాగుతున్నాయి. 2022 జూన్​ నాటికి కంప్లీట్ కావాల్సి ఉండగా ఇప్పటికీ పనులు పెండింగ్ ఉన్నాయి. టెండర్​ లో ఖమ్మానికి చెందిన సంస్థ కాంట్రాక్ట్​ దక్కించుకోగా మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్​ ఎమ్మెల్యే సపోర్టుతో కాంట్రాక్టర్​ ను పక్కనపెట్టి నేలకొండపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్​ నేత పనులు చేస్తున్నారు. 

పనులు లేట్ కావడంతో ఆర్నెళ్ల పాటు గడువు పెంచి, కాంట్రాక్టర్​ పై రూ.30 వేల జరిమానా విధించారు. అయినా ఇప్పటి వరకు కంప్లీట్ కాకపోవడంతో కలెక్టర్​ కూడా సీరియస్​ గా స్పందించారు. గతంలో తాను ఈ పనులను చూసినప్పటి నుంచి ఆర్నెళ్లు గడిచినా, ఒక్క ఇటుక పని కూడా జరగలేదంటూ కాంట్రాక్టర్​ పై ఫైర్​ అయ్యారు. వచ్చే నెలలోగా కంప్లీట్ చేయకపోతే, రాష్ట్రంలో మరెక్కడా పనులు చేయకుండా బ్లాక్​ లిస్ట్ లో పెడతానని హెచ్చరించారు.

 ఇప్పటి వరకు రూ.50 లక్షల బిల్లులు చేశానని చెప్పడంపై టూరిజం డిపార్ట్ మెంట్ ఏఈపైనా సీరియస్​ అయ్యారు. ఇలాంటి వారికి బిల్లులు చేస్తే అధికారులను కూడా సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.  ఈ తరహా లీడర్లు, కాంట్రాక్టర్లపై ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అధికారులు కూడా అలాంటి లీడర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.